– రూ.30 లక్షల ఆస్తి నష్టం
– ఖమ్మంలోని బుర్హాన్‌పురం పిన్ని ఎలైట్ హోమ్ అపార్టుమెంట్‌లో ఘటన
నవతెలంగాణ-ఖమ్మం
ఓ అపార్టుమెంట్‌లో పండగ రోజు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురైన సంఘటన ఖమ్మం నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. నగరంలోని బుర్హాన్‌పురం పిన్ని ఎలైట్ హోమ్ అపార్టుమెంట్‌లోని మూడో ప్లాట్‌లో దట్టమైన పొగలతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అపార్టుమెంట్ సమీపంలో ఉన్న మరో అపార్టుమెంట్‌లోని వారు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలం వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా నూతన అపార్టుమెంట్ కావడంతో ఆ ప్లాటులో యజమాని ఉండటం లేదు. దాంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని ప్లాటు యజమాని సత్తిరెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో ప్లాటులోని తలుపులు, సీలింగ్, క బోర్డులు, గోడలు మొత్తం పూర్తిగా తగులబడిపోయాయి. సుమారు రూ.30 లక్షలపైగా ఆస్తినష్టం జరిగిందని యజమాని తెలిపారు.