Sudiksha Konanki Case: భారత స్టూడెంట్ సుదీక్ష కోణంకి మార్చి 6 నుంచి కన్పించకుండాపోయారు. డొమినికన్ రిపబ్లిక్‌లోని రియూ రిపబ్లికా రిసార్ట్ బీచ్ వద్ద ఆమె చివరిసారిగా కన్పించారు. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లేదు. ఆమె ఆచూకీ కోసం ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్ పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది.
వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల కోనంకి పిట్స్ బర్గ్ యూనివర్శిటీలో చదువుతోంది. సెలవుల్లో వెకేషన్ కోసం ఐదుగురు స్నేహితులతో కలిసి డొమినికన్ రిపబ్లిక్ ప్యూంటా కానా వెళ్లింది. మార్చి 6న రిసార్టులో పార్టీ తర్వాత తెల్లవారుజామున 3 గంటలు హఠాత్తుగా సుదీక్ష కనిపించలేదు. ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రియు రిపబ్లికా బీచ్ ప్రాంతంలో అలల తాకిడికి ఆమె తప్పిపోయిందని పోలీసులు గుర్తించారు. సుదీక్ష కనిపించకుండా పోవడానికి ముందు ఐయోవాకు చెందిన 24 ఏళ్ల టూరిస్ట్ జాషువా స్టీవెన్ రిబెతో ఆమె బీచ్ కు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. అలల తాకిడికి ఆమె కిందపడితే ఆమెను తీసుకువచ్చినట్టు ఆయన పోలీసులకు తెలిపారు. అలల తాకిడితో కొట్టుకుపోయిన ఆమె నీళ్లు తాగి స్పృహ కోల్పోయినట్టు చెప్పారు.
సుదీక్షకోసం బీచ్ లో డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.సుదీక్ష మిస్సింగ్ పై రిసార్ట్ పరిసరాలు, సముద్రం వద్ద భద్రతా సిబ్బంది గాలించారు. అయితే తన కూతురు కన్పించకుండా పోవడంపై కిడ్నాప్, మానవ అక్రమ రవాణా అవకాశాలను కూడా పరిశీలించాలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోరారు.
బీచ్ లో సుదీక్ష దుస్తులు, చెప్పులను గుర్తించారు. బీచ్ లాంజ్ లో చైర్ పై ఆమె వదిలిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యులకు చూపారు. ఈ దుస్తులు సుధీక్షవేనని కుటుంబసభ్యులు చెప్పారు.