అడ్డంగా బుక్ కావటం కేటీఆర్ కు అలవాటుగా మారిందా?

Written by RAJU

Published on:

ప్రత్యర్థి మీద దూసే కత్తి కానీ.. మాట కానీ పదునుగా ఉండాలి. చీల్చిపారేయాలే తప్పించి.. ఏదో ప్రాక్టీస్ సెషన్ లా ఉండొద్దు. అందులోనూ ప్రజాస్వామ్య భారతంలో మాట్లాడే ప్రతి మాటకు ఈకకు ఈక.. పీకకు పీక లెక్కసే బ్యాచులకు తక్కువ లేదు. అందులోనూ సోషల్ మీడియా కాలంలో మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే.. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టుల విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలి. కానీ.. ఈ విషయాల్ని బీఆర్ఎస్ చిన్న బాస్ కేటీఆర్ పట్టించుకోవటం లేదు.

తన తండ్రి కేసీఆర్ తీరుకు పూర్తి భిన్నంగా ఆయన వైఖరి ఉంటుంది. కేసీఆర్ ఎప్పుడూ క్వాంటిటీ చూడరు. క్వాలిటీ చూస్తారు. ప్రత్యర్థిని టార్గెట్ చేసేందుకు అవసరమైన టైం కోసం ఓపిగ్గా ఎదురుచూస్తారు. తన టైం వచ్చినంతనే ఆకలితో ఆబగా మీద పడిపోరు. సమయం.. సందర్భాన్ని చూస్తారు. అన్ని బాగున్నాయి అన్న తర్వాత ఆయన షురూ చేస్తారు. ప్రత్యర్థులకు ఊపిరి ఆడనివ్వని రీతిలో ఉక్కిరిబిక్కిరి చేస్తారు.

అందుకు భిన్నంగా కేటీఆర్ స్టైల్ ఉంటుంది. గతంలో రోజుకు ఏదో ఒకటి మాట్లాడాలన్నది నియమంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అక్కడితో ఆగని ఆయన ఇటీవల కాలంలో రోజుకు నాలుగైదుసార్లు ఏదోలా వార్తల్లో ఉండాలన్నట్లుగా తపిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే.. ప్రతి అంశాన్ని టచ్ చేసి.. ఆవు కథ మాదిరి.. రేవంత్ సర్కారును తిట్టిపోయేటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తన తండ్రి మాదిరి క్వాలిటీ కంటే క్వాంటిటీనే మెరుగన్నట్లుగా ఆయన తీరు ఉంటోంది.

తాజాగా ఎస్ఎల్ బీసీలో చోటు చేసుకున్న దుర్ఘటన నేపథ్యంలో రేవంత్ సర్కారుపై ఆయన విరుచుకుపడుతూ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నుంచి వాటిని చూస్తే.. ‘‘ఎస్ఎల్ బీసీలో సెంటీమీటర్ సొరంగం తవ్వడం కూడా చేతకాని సీఎం, 12 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేసిన బీఆర్ఎస్ పై నిందలు వేయడం సిగ్గుచేటు. గత 13 నెలలుగా ప్రాజెక్టు పనులను పూర్తిగా పండబెట్టి, తన వైఫల్యాన్ని గత ప్రభుత్వంపైకి నెట్టాలనే నీచానికి దిగడం అత్యంత దుర్మార్గం మొత్తం సొరంగం 43.94 కిలోమీటర్లైతే, 2005-2014 వరకున్న గత కాంగ్రెస్ సర్కారు హయాంలో తవ్వింది కేవలం 22.89 కిలోమీటర్లే.సొరంగంలో క్లిష్టమైన పరిస్థితులున్నా, ఏ ప్రమాదం జరగకుండా ఏకంగా 12 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తి చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది’’ అని చెప్పుకొచ్చారు.

ఇలాంటి మాటలు కదా సెల్ఫ్ గోల్ కొట్టుకోవటం అనేది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ ఎంత? అప్పుడున్న పరిస్థితులు ఏమిటి? అప్పుడున్న ప్రాధాన్యతలు ఏమిటి? తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ.. ప్రాజెక్టులు.. పనులు లాంటివి పూర్తిగా పక్కన పెట్టేయటం తెలిసిందే. అలాంటి వేళలో కాంగ్రెస్ ప్రభుత్వం 22.89 కి.మీ. పూర్తి చేయటం మామూలు విషయం కాదు.

అదెలా అంటారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ లెక్కలు ఎంత భారీగా పెరిగాయో తెలిసిందే. అలాంటి కీలకమైన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ సర్కారు 12 కి.మీ. పూర్తి చేయటం దేనికి నిదర్శనం? కష్టంగా.. క్లిష్టమైన పనులు చేసినట్లుగా కేటీఆర్ చెబుతున్నప్పటికీ.. ఆ టన్నెల్ ప్రాజెక్టే కష్టమైనది. అందరికి ఒకేలాంటి కష్టం ఉంటుందే తప్పించి.. ఒకరికి తేలిగ్గా.. ఇంకొకరికి కష్టంగా ఉండదు కదా?

ఇరవైఏళ్ల క్రితం ఉన్న ప్రభుత్వం పదేళ్ల కాలంలో 22.89 కి.మీ. పనులు పూర్తి చేసినప్పుడు.. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికతో పదేళ్ల కాలంలో పూర్తి చేయాలి కదా? అందుకు భిన్నంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే సగం మాత్రమే చేయటం దేనికి నిదర్శనం? ‘‘నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ పనులకు రూ.3300 కోట్ల ఖర్చుచేస్తే, బీఆర్ఎస్ పాలనలో రూ.3900 కోట్ల పనులు పూర్తిచేసిన వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ముఖ్యమంత్రి బొక్కబోర్లా పడ్డారు’’ అంటూ ఎంత ఎటకారం చేసినా.. అంకెలు చెప్పాల్సిన విషయాల్ని చెప్పేస్తాయన్నది మర్చిపోకూడదు.

అప్పుడున్న వార్షిక బడ్జెట్లను పరిగణలోకి తీసుకొని రూ.3300 కోట్లను లెక్కలోకి తీసుకొని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని పదేళ్ల బడ్జెట్ ఖర్చులతో లెక్కేస్తే.. ఈ ప్రాజెక్టు కోసం కేసీఆర్ సర్కారు చేసిన ఖర్చు వ్యవహారం ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. అందుకే అంటారు.. గణాంకాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు తమకు ఎదురయ్యే కౌంటర్లను కూడా పరిగణలోకి తీసుకొని వాదనల్ని సిద్ధం చేసుకోవాలే తప్పించి.. ఇష్టారాజ్యంగా మాట్లాడితే మొదటికే మోసం కలుగుతుందన్నది మర్చిపోకూడదు. ఈ విషయాల్ని కేటీఆర్ ఎప్పటికి అర్థం చేసుకుంటారు? ఇప్పటికైనా కళ్లు తెరిచి.. ఈ తరహా సెల్ఫ్ గోల్స్ కొట్టుకోవటం మానేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Subscribe for notification