అడుగంటుతున్న భూగర్భజలాలు

Written by RAJU

Published on:

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరుకున్నది. భూగర్భ జలాలు అత్యంత వేగంగా పడిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంవత్సర ప్రారంభంలో ఉన్న భూగర్భ జలాలకు ప్రస్తుత జలాలకు పోల్చితే మీటరు నుంచి మీటరున్నర లోతుకు పడిపోయాయి. దీంతో మెట్ట ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పనిచేయకుండా పోతున్నాయి. ఒక వైపు భూగర్భ జలాలు అడుగంటడం, కాలువ చివరి భూములకు సాగు నీరందకపోవడంతో పంట పొలాలు ఎండి పోతున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా ఉన్న బావులు, బోర్లు అడుగంటి పోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో సైతం భూగర్భ జలాలు పడిపోయి నీటి అవసరాలు తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఫ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి

జిల్లాలోని గంగాధర మండలంలో జనవరిలో 12.75 మీటర్ల లోతున నీరు లభించగా ప్రస్తుతం 14.34 మీటర్ల లోతుకు జలాలు పడిపోయాయి. చొప్పదండి మండలంలో జనవరిలో 11.12 మీటర్ల లోతు ఉన్న నీరు 12.24 మీటర్లకు పడిపోయింది. రామడుగులో 9.44 మీటర్ల నుంచి 10.62 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోగా, జిల్లాలో సగటున 0.60 మీటర్ల లోతుకు పడిపోయాయి. గత సంవత్సరం ఫిబ్రవరితో పోల్చితే కూడా గతం కంటే అర మీటరు లోతుకు నీరు పడిపోయింది. కరీంనగర్‌లో 8.51 మీటర్ల నుంచి 9.73 మీటర్లకు, కొత్తపల్లిలో 8.15 మీటర్ల నుంచి 9 మీటర్ల వరకు, గన్నేరువరంలో 8.42 మీటర్ల నుంచి 8.72 మీటర్ల లోతుకు, తిమ్మాపూర్‌లో 6.8 నుంచి 8.06 మీటర్లకు నీరు పడిపోయింది.

ఫ హుజూరాబాద్‌ డివిజన్‌లో మెరుగ్గా..

ఆయకట్టు ప్రాంతమైన హుజూరాబాద్‌ డివిజన్‌లో భూగర్భ జలాల పరిస్థితి మెరుగ్గానే ఉన్నది. ఎస్సారెస్పీ ఆయకట్టుకు వారబంధి పద్ధతిలో నీరు విడుదల చేస్తుండగా, ఆయా ప్రాంతాల్లో సాగునీటికి పెద్దగా ఇబ్బంది లేకున్నా కాలువ చివరి భూములకు మాత్రం నీరందడం లేదు. ఈ ప్రాంతాల్లో రైతులు భూగర్భ జలాల మీద ఆధారపడి సాగు చేసుకోవాల్సి వస్తున్నది. జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని పైభాగంలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. సాగు, తాగునీటి కోసం బోర్లు అదే పనిగా నడపాల్సి వస్తుండడంతో మరింత వేగవంతంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయి.

ఫ వాణిజ్య అవసరాలకు పెరుగుతున్న నీటి వినియోగం

జిల్లాలో రైస్‌మిల్లులు, గ్రానైట్‌ పరిశ్రమ, ఇతర పారిశ్రామిక వాణిజ్య అవసరాలకు నీటి వినియోగం ఎక్కువవుతుండడంతో కూడా భూగర్భ జలాలను ఇబ్బడి ముబ్బడిగా తోడేస్తున్నారు. మార్చి మాస ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మే మాసం వరకు భూగర్భ జలాల పరిస్థితి దారుణంగా మారి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదమున్నది. చెరువులు, కుంటల్లో నీరు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆయకట్టేతర ప్రాంతాల్లో నీటి వనరుల్లో సగానికి పైగా తగ్గిపోయాయి. జిల్లాలో 2.64 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మరో 50 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యాయి. ఈ పంటలకు చివరి దశలో నీటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. ఇప్పుడే ఎండలు 36 డిగ్రీలకు చేరడంతో వేడి పెరిగి అటు నీటి సమస్య, ఇటు వేడి సమస్యతో రైతులు పంటలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం బోర్లపై ఆధారపడాల్సి వస్తే అప్పటి వరకు విద్యుత్‌ సమస్య కూడా తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Subscribe for notification