బీఆర్ ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలివి తక్కువ తనాన్నే.. వారి తెలివిగా భావిస్తున్నారని, అజ్ఞానాన్నే విజ్ఞానంగా ఫీలవుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వారిని చూసి నవ్వుకోవాలో.. సిగ్గు పడాలో తెలియడం లేదన్నారు. అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంపైనా.. చెణుకు లు విసురుతున్నారని చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని గాంధీ భవన్‌లో(కాంగ్రెస్ ఆఫీస్) రూపొందించారని చెబుతున్నారని, కానీ, తమకు మేనిఫెస్టోనే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని.. దీనినే.. గవర్నర్ ప్రసంగంలో వినిపించామన్నారు.
దేశంలో తాము ఒక్కరమే.. ఈ పనిచేయడం లేదన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు కూడా.. రాష్ట్రపతి ప్రసంగంలోనూ ఎన్నిక లసమయంలో ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలోని అంశాలను మాత్రమే ప్రసంగం లో పొందుపరుస్తారని, ఆ సంప్రదాయాన్నే తాము కొనసాగిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో గవర్నర్ ప్రసంగాన్ని పరిశీలిస్తే.. కూడా అప్పటి పాలకులు కూడా ఇదే పనిచేశారని తెలిపారు. మహిళా గవర్నర్‌ను కూడా అవమానించిన సర్కారు బీఆర్ ఎస్ దేనని చెప్పుకొచ్చారు.

మహిళలను దుయ్యబట్టిన నాయకులు, సభా ముఖంగా అవమానించిన వారు(బీఆర్ ఎస్ నాయకులు) ఇప్పుడు నీతులు చెబుతున్నారని, కానీ, తమది ప్రజా ప్రభుత్వమని.. ప్రజలకు ఏం చెప్పామో.. అదే ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో ప్రతిబింబించిందన్నారు. 2022లో అసలు గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జట్‌ను ప్రవేశ పెట్టారంటే.. వీరికి(బీఆర్ ఎస్) గవర్నర్ వ్యవస్థ పట్ల ఎంత చిత్త శుద్ధి ఉందో అర్ధం అవుతుందన్నారు. ఇలాంటి వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.
ఆ పార్టీకి గుండుసున్నానే!
ఇష్టానుసారంగా వ్యవహరించిన వారికి(బీఆర్ ఎస్) పార్లమెంటు ఎన్నికల్లో గుండుసున్నా వస్తుందని తాను ముందే చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు కూడా వారు పద్ధతి మార్చుకోలేదని.. దీంతో వారికి రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుండుసున్నానే మిగులుతుందని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమం కోసం ఎవరు ఎన్ని సలహాలు చెప్పినా.. తీసుకుంటామన్నారు. కానీ, ఈ విషయాన్ని వదిలేసి .. గవర్నర్ వ్యవస్థనే కించపరుస్తున్నారని నిప్పులు చెరిగారు.