– సింగరేణి సీఎమ్‌డీ ఎన్ బలరాం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసమానతలు లేని సమాజ నిర్మాణమే అంబేద్కర్‌కు ఘనమైన నివాళి అని సింగరేణి కాలరీస్ సీఎమ్‌డీ ఎన్ బలరామ్ అన్నారు. భారత జాతిని ఏకతాటిపై నిలిపేందుకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి అని కొనియాడారు. సోమవారంనాడిక్కడి సింగరేణి భవన్‌లో భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రగతికి అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దిశా నిర్దేశం చేసిందన్నారు. రాజ్యాంగం వల్లే ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, సమానత్వం, సమాన అవకాశాలు లభించాయన్నారు. కార్మికులు, మహిళలకు హక్కులను కల్పించారన్నారు. అంబేద్కర్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూమెంట్) ఎస్‌డీఎమ్ సుభానీ అధ్యక్షత వహించారు. ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధి బోడ భద్రు తదితరులు పాల్గొన్నారు.