– ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
సుభాష్‌నగర్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధన దిశగా ప్రభుత్వం పని చేస్తుందని మానకొండూరు శాసనసభ సభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తాలో జిల్లా యంత్రాంగం ఆధర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించి కార్యక్రమంలో మాట్లాడుతూ సామాజిక సాధికారత దిశగా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందన్నారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా యువతకు వివిధ పోటీ పరీక్షల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. 30 సంవత్సరాల పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అంబేద్కర్ జయంతి రోజు నుంచి అమలు చేయడం గొప్ప విషయమన్నారు. భూ సమస్యల పరిష్కారం, కబ్జాల నియంత్రణ కోసం రూపొందించిన భూ భారతి చట్టాన్ని అంబేద్కర్ జయంతి రోజున అమలు చేస్తున్నామని తెలిపారు. సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించారని తెలిపారు. ఆయన చూపిన బాటలో నడుచుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ ప్రపుల్‌దేశాయ్ మాట్లాడుతూ భారతదేశం పేరును ప్రపంచ స్థాయిలో నిలిచిపోయేలా చేసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. మున్సిపల్ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ మాట్లాడుతూ 70 సంవత్సరాల తరువాత కూడా దేశ పౌరులందరు ఐక్యంగా ఉన్నారంటే అందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచనలే కారణమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలాసత్పతి, పోలీసు కమిషనర్ గౌస్ఆలం, వివిధ సంఽఘాల నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఫ ఆర్టికల్-3 ద్వారానే తెలంగాణ…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మెన్ గజ్జల కాంతం అన్నారు. అంబేద్కర్ జయంతిని అందరు కలిసి నిర్వహించుకోవాలన్నారు. అంబేద్కర్ కల్పించిన హక్కులను కాపాడుకుంటామని అన్నారు. కార్యక్రమంలో సభాధ్యక్షురాలు కోండ్ర స్వరూప, బోయినిపల్లి చంద్రయ్య, సముద్రాల అజయ్, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ సత్తు మల్లేశం, ఎస్సీ వెల్ఫేర్ డీడీ పవన్‌కుమార్, కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కంసాల శ్రీనివాస్, గండి రాజేశ్వర్, బోయిని కొమురయ్య, ఎర్రోల మల్లేశం, కొరివి అరుణ్‌కుమార్, కన్నం అంజయ్య, బొత్త వెంకటమల్లయ్య, కొమ్ము రమేశ్, చిగిరి శోభ, ఆవారు లత, జీడీ రమేశ్, మైసని మనోహర్, గసికంటి అరుణ్, కలర్ సత్తన్న, ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్, పడాల రాహూల్, గడ్డం కొమురయ్య, ముక్క భాస్కర్, ఎనమల మంజుల, లింగంపల్లి బాబు, కుతాడి శివరాజ్, మారంపల్లి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.