అందాల పోటీల పేరుతో అర్ధ నగ ప్రదర్శనలా!

Written by RAJU

Published on:

అందాల పోటీల పేరుతో అర్ధ నగ ప్రదర్శనలా!– టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు
– ఎస్వీకేలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం
నవతెలంగాణ – ముషీరాబాద్‌
అందాల పోటీల పేరుతో అర్ధనగ ప్రదర్శనలు చేయడం నీతి మాలిన చర్య అని టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘అంగాంగ విన్యాసాల అందాల పోటీలకు రూ.55 కోట్లా, తెలంగాణ కళాకారులకు గాడిద గుడ్డా’ అనే అంశంపై బుధవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 430 ఏండ్లకుపైగా చరిత్ర కలిగిన హైదరాబాద్‌ నగరం ప్రేమ నగరంగా, భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతి నగరంగా, కళా వారసత్వంగా, అన్నింటికంటే స్త్రీలను గౌరవించే నగరంగా ఉందన్నారు. ఇప్పుడు అందాల పోటీలను నిర్వహించి హైదరాబాద్‌ను ఏ నగరంగా మార్చబో తున్నారని ప్రశ్నించారు. అంగాంగ ప్రదర్శనలతో స్త్రీల శరీరాలను అవమానించడం కాదా అని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారెటీలకే దిక్కులేదు కానీ ..అందాల పోటీలా.. ఈ అందాల పోటీల ద్వారా తెలంగాణకు ఏం తెస్తారని ప్రశ్నించారు. 12 సంవత్సరాలుగా కళాకారులు, టీపీఎస్‌కే ఆందోళనలు, వినతి పత్రాలు సమర్పించినా వారికి పట్టెడన్నం పెట్టే పథకం తేలేదన్నారు. కానీ రూ.55 కోట్లు ఖర్చుపెట్టి అందాల పోటీలను నిర్వహిస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. తెలంగాణ సినిమా జానపద జేఏసీ చైర్మెన్‌ మురళీధర్‌ దేశ్‌పాండే మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ అంటే విదేశీ యువతుల అందాల ఆరబోతను చూసి తెలంగాణ ప్రజలు తరించండి అని చెప్పడమా.. అని ప్రశ్నించారు. టీపీఎస్‌కే హైదరాబాద్‌ కమిటీ కన్వీనర్‌ జి.నరేష్‌ మాట్లాడుతూ.. ఒకవైపు హైదరాబాద్‌ సెంటర్‌ ‘డ్రగ్స్‌ మాఫియా’గా మారితే అరికట్టలేని పాలకులు.. అందాల పోటీలతో తెలంగాణ యువతను ఎటువైపు నెట్టేయాలని అనుకుంటున్నా రని ప్రశ్నించారు. జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షులు కుర్ర రవీంద్రర్‌గౌడ్‌, పరపతి సంఘాల అధ్యక్షురాలు కె.నిర్మల, వాల్మీకి బోయ రాష్ట్ర అధ్యక్షులు బోయ గోపి, డాక్టర్‌ తిరునగరు స్వామి, సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ పౌర హక్కుల నేత, టీపీఎస్‌కే హైదరాబాద్‌ సౌత్‌ కన్వీనర్‌ మహేష్‌, సావిత్రిభాయి ఫూలే పౌండేషన్‌ సి.పరమేశ్వరి, మాదర బోయిన నరసయ్య, ఎమ్మార్పీఎస్‌ ఓయూ ప్రెసిడెంట్‌ ఎం.వేణుగోపాల్‌, ఎన్‌.రాఘవేంద్ర, పీడీఎస్‌యూ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights